Srimad Valmiki Ramayanam

Balakanda Chapter 26

' Death of Tataki !'

With Sanskrit text in Telugu , Kannada and Devanagari,

మునేర్వచనమక్లీబం శ్రుత్వానరవరాత్మజః|
రాఘవః ప్రాంజలిర్భూత్వా ప్రత్యువాచ దృఢవ్రతః ||

తా|| నరులలో శ్రేష్ఠుడైన ఆ రాఘవుడు విశ్వామిత్రునియొక్క ధైర్యమును గొలుపునట్టి మాటలను విని దృఢనిశ్చయము కలవాడై ఇట్లు పలికెను

బాలకాండే
ఇరువది ఆఱవసర్గము
( తాటక వధ)

నరులలో శ్రేష్ఠుడైన ఆ రాఘవుడు విశ్వామిత్రునియొక్క ధైర్యమును గొలుపునట్టి మాటలను విని దృఢనిశ్చయము కలవాడై ఇట్లు పలికెను.

' విశ్వామిత్రునియొక్క వచనములను నిశ్శంకముగా పాటింపమని తండ్రిచెప్పిన ఆదేశము. పిత్రు వచనమును గౌరవించుటకునూ , మహాత్ముడు మా తండ్రి అయిన దశరథుడుఅయోధ్యలో వశిష్ఠాది గురువులసమక్షములో ఆజ్ఞాపించుటవలననూ, నాకు ఆ మాట ఉల్లంఘింపరానిది. నేను తండ్రి వచనముల ప్రకారము బ్రహ్మవాదులైన మీ శాసనము ప్రకారము ఆ తాటకిని వధించి తీరెదను. గో బ్రాహ్మణ హితము కోసము ఈ దేశముయొక్క సౌఖ్యము కొఱకు మీ వచనమును పాటించుటకు పూనుకొనుచున్నాను'.

ఇట్లు చెప్పి ఆ శత్రుమర్దనుడైన రాఘవుడు ధనుస్సును మధ్యలో పిడికిట బట్టి అన్ని దిక్కులలో మారుమోగునటుల ధనుష్ఠంకారమును చేసెను. ఆ శబ్దముతో తాటకావనవాసులు భయకంపితులైరి . తాటకి కూడా అ శబ్దముతో మిక్కిలి క్రుద్ధురాలయ్యెను. ఆ శబ్దమును విని క్రోధముతో మూర్ఛపోయిన తాటకి ఎక్కడనించి ఈ శబ్దము వచ్చెనో ఆ దిశకి వేగముగా పరుగులు తీసెను.

క్రోధముతో వికారమైన రూపము వికృతమైన ముఖము పెద్ద ప్రమాణములు గల ఆ తాటకిని చూచి రాఘవుడు లక్ష్మణునితో ఇట్లు పలికెను.

' ఓ లక్ష్మణా ! ఈ యక్షిణి యొక్క భయంకరమైన వికృతాకారము చూడుము. ఈమెను చూచినచో భీరువుల హృదయములు బద్దలగును. మాయాబలములతో గూడినదియూ, ఎదిరింప శక్యముగాని బలముకలదియూ అగు ఈ తాటకి యొక్క చెవులు ముక్కులని ఖండించి వెనుకకు పోవునటుల చేసెదను చూడుము. ఈమె స్త్రీ అగుటవలన చంపుటకు నేను ఇష్ట పడుట లేదు.ఈమె వీర్యమును గతిని నశింపచేయుట యుక్తము'.

ఈవిధముగా రాముడు పలుకు చుండగా క్రోధముతో వీగుచున్న తాటకి తన భుజములను ఎత్తుగా చేసి గర్జించుచూ రాముని పై విజృంభించెను. అప్పుడు బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడును హుంకారము చేసి , 'రామలక్ష్మణులకు శుభమగుగాక', 'జయమగుగాక' అని అశీర్వదించెను.

అంతట ఆ తాటకి రామలక్ష్మణుల పైకి భయంకరముగా ధూళిని చిమ్ముచూ , తీవ్రమైన ఆ ధూళి ప్రభావముతో వారిని క్షణమాత్రము సమ్మోహితులను చేసెను. ఆ తాటకి మాయా ప్రభావముచే వారికి కనపడకుండా శిలావర్షము కురిపించెను. అంతట రాముడు క్రుద్ధుడై తన శరపరంపరచే ఆ శిలావర్షమును భగ్నమొనర్చెను. తన మీదికి విఝృంభించుచున్న ఆ తాటకియొక్క చేతులని ఖండించెను. ఈ విధముగా చేతులు తెగి యున్ననూ తమ పైకి గర్జించుచూ వచ్చుచున్న తాటకి చెవులు ముక్కులను లక్ష్మణుడు కోసి వేసెను.

కామరూపిణి అయిన ఆ యక్షిణి బహురూపములనుపొంది తన మాయచే రామలక్ష్మణులను భ్రమ పెట్టుటకు చూచెను. రామలక్ష్మణులకు కనపడకుండా మళ్ళీ శిలావర్షము కురిపించుచూ అటు నిటు తిరగసాగెను. అన్ని వైపులనుండి కురుయుచున్న శిలా వర్షములో చిక్కుపడిన రామలక్ష్మణులను చూచి శక్తిమంతుడైన విశ్వామిత్రుడు ఇట్లు పలికెను .

'ఓ రామా! ఇంతవఱకు ఆమెపై చూపిన జాలి చాలును. పాపాత్మురాలైన ఈ యక్షిణి దుర్మార్గురాలు. ఈమె యజ్ఞములకు విఘ్నము కలిగించును. మాయా ప్రభావముచే ఈమె ఇంకనూ బలపడును సంధ్యా కాలము సమీపించుచున్నది. రాక్షసులు సంధ్యాకాలములో బలోపేతులగుదురు. ఈ లోపలనే ఈమెను హతమార్చుము'.

ఈ విధముగా చెప్పబడిన శ్రీరాముడు రాళ్ళవర్షము కురిపించుచున్న ఆ యక్షిణిని రాముడు శబ్ధబేధి యను అస్త్రముతో నిలువరించెను. ఈ విధముగా ఆడగింపబడి క్రుద్ధురాలైన తాటకి రామలక్ష్మణులవేపు దాడిచేయుటకు పరుగులు తీసెను. ఆవిధముగా వేగముగా వచ్చుచున్న ఆ తాటకిని బాణములతో విక్రాంతుడగు శ్రీరాముడు కొట్టెను. వేంటనే ఆ యక్షిణి కిందబడి ప్రాణములు కోల్పోయెను.

భయంకరమైన ఆకారముగల ఆ తాటకి ఈ విధముగా మరణించుట చూచి ఇంద్రాది దేవతలు 'బాగు' 'బాగు' అని ప్రశంసించిరి. పరమప్రీతులైన ఇంద్రుడును తదితర దేవతలూ విశ్వామిత్ర మహర్షితో ఇట్లనిరి. ' ఓ విశ్వామిత్ర మునీ నీకు శుభమగుగాక. ఈ తాటక వధవలన ఇంద్రునితో సహా దేవతలందరూ సంతసించిరి. ఆ రామలక్ష్మణులపై ప్రేమ జూపుము. ఓ బ్రహ్మర్షీ ! ప్రజాపతి అయిన భృశాస్వుని కుమారులు సత్య పరాక్రములు. వారు తపొ బల సంపన్నులు. అస్త్రరూపములో నున్నవారిని శ్రీరామునకు సమర్పింపుము. ఓ మునీ! శ్రీరాముడు స్థిర సంకల్పముతో నీ సేవలను చేయుచున్నాడు. కావున ఈ అస్త్రములను పొందుటకు పాత్రుడు. ఇతడు దేవతల కొఱకై ఒక మహాకార్యమును చేయవలసి యున్నది'.

దేవతలందరూ ఈ విధముగా పలికి , విశ్వామిత్రుని పూజించి సంతోషముతో తమతమ నివాసములకు పోయిరి.

అంతట ఆ మహర్షి తాటక వధకు సంతుష్ఠుడాయెను. ప్రేమతో శ్రీరాముని తలను మూర్కొనెను. పిమ్మట ఆ రాఘవునితో ఇట్లనెను. ' శుభదర్శనుడవగు ఓ రామా ! ఈ రాత్రికి ఇచటనే నివశింతము . రేపు ఉదయముననే బయలు దేరి మన ఆశ్రమమునకు వెళ్ళేదము'. విశ్వామిత్రుని వచనములను విని రాముడు సంతసించెను . వారందరూ ఆరాత్రి అచటనే గడిపిరి.

అంతట ఆ వనము శాపవిముక్తమై అప్పటినుండి యే రమణీయమైన చైత్ర రథము వలె విరాజిల్లెను.

ఆ రాముడు ఆ యక్షసుతను హతమార్చి , సురులు సిద్ధులచే ప్రశంసింపబడి మునీశ్వరునితో గూడి అచటనే గడిపెను. ప్రాతః కాలమున మునీశ్వరుడు వారిని మేలు కొలిపెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే
బాలకాండే షద్వింశ స్సర్గః ||
సమాప్తం ||

నిహత్య తాం యక్షసుతాం స రామః
ప్రశస్యమానః సురసిద్ధ సంఘైః |
ఉవాస తస్మిన్ మునినా సహైవ
ప్రభాత వేలాం ప్రతిభోధ్యమానః ||

'ఆ రాముడు ఆ యక్షసుతను హతమార్చి , సురులు సిద్ధులచే ప్రశంసింపబడి మునీశ్వరునితో గూడి అచటనే గడిపెను. ప్రాతః కాలమున మునీశ్వరుడు వారిని మేలు కొలిపెన".


|| om tat sat ||